Saturday, September 29, 2012

అర్జునుడు - IX


   అర్జున్ కి మళ్ళీ ఒక కల వస్తోంది.

    చిమ్మ చీకటి. ఉరుములు, మెరుపుల మధ్య వాన. ఎక్కడా ఏమీ కానరాని ఆ వానలో అప్పుడప్పుడు మెరుపులు మెరిసినప్పుడల్లా ఒక మెరుపులా నేల మీద కనిపిస్తోంది ఒక రధం. ఏడు శ్వేతాశ్వాలు అతి వేగం గా పరిగెడుతున్న ఆ రధం లో ఉన్నది ఒక రాకుమారుడు, వెనుక రధంలో ఉన్నది ఒక నిండు చూలాలు. అయితే ఈ రాకుమారుడు అర్జున్ లాగ లేదు, అర్జున్ కి ఇదంతా తాను బయటినించి చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె సొమ్మసిల్లి పడి ఉంది. శ్వేతాశ్వాలను అతి వేగం గా పరుగు తీయిస్తున్నాడు అతడు. ఆ దారికి అంతం ఎక్కడా అతనికి కనిపించడం లేదు. ద్రష్ట చెప్పింది గుర్తుంది అతనికి, అది ఎంత దుస్సాధ్యమైనా, మానవ ప్రయత్నం చెయ్యక తప్పదు మరి. అతని కళ్ళలోని అశ్రుధారలు, ఆ అఘోరమైన తుఫాను వానలో కలిసిపోయాయి. 

    వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం (మన భాషలో చెప్పాలనుకుంటే), 10 మైళ్ళ దూరంలో ఉన్న రామ దేవాలయం. అక్కడికి వెళ్ళడానికి వాళ్లకి ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే time ఉంది. గుర్రాలు, ఎంత జాతి అశ్వాలు అయినా, పది మైళ్ళు పరిగెత్తడానికి, పది నిముషాలు తీసుకుంటాయి. దైవ సంకల్పం మాత్రమే వాళ్ళని, ఈ పరిస్థితి నించి బయటకు తీసుకువెళ్ళగలదు. "హే కృష్ణా... ముకుందా... పాహి పాహి..." మనసులో ప్రార్ధించాడు అతడు.

   ద్రష్ట వర్తమానం తెలియగానే అతను చెయ్యగలిగినదంతా చేసాడు. అన్ని గండభేరుండ పక్షులు (Genetically Engineered Animals), స్వయంచోదక విద్యుల్లతాశ్వాలు, మహాశ్వేత వరాహాలు యుద్ధంలోనికి నియోగింపబడటం చేత, సామాన్యమైన అశ్వాలతో కూడిన రధాలు మాత్రమే మిగిలాయి అతనికి. వాటితోనే, రాబోయే ముప్పు గురించి నగరమంతా చాటింపు వేయించాడు. అటువంటి ఒక రధాన్ని సమకూర్చుకుని, ద్రష్ట ఆజ్ఞ మీద, అయిష్టంగా తన నగర ప్రజలని వదలి పయనమయ్యాడు అతడు. అతని సేనాని నగర ప్రజలలో వాళ్ళు వీళ్ళని కాకుండా, వృద్ధులు, బాలలు, మహిళలను తీసుకుని, రధాలతో నగరం అవతలకి పంపిస్తున్నాడు. 

     రధాన్ని తీసుకుని నగరాన్ని దాటుతున్నరాకుమారునికి అనేక హృదయ విదారకమైన దృశ్యాలు పొడగాట్టాయి. అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నగర ప్రజానీకం లో ఒక్క పిట్ట కూడా చావు తప్పించుకోలేదు. ఈ విషయం తెలిసి, ప్రయత్నిస్తున్న తన అమాయక ప్రజలను అతడు చూడలేకపోయాడు. కొందరు తల్లిదండ్రులు, పిల్లలను వదిలిపెట్టి, పరుగులు తీస్తున్నారు. కొందరు యువకులు, వృద్ధులైన తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, రధాలలో స్థానం కోసం ఎగబడుతున్నారు. కొందరు భార్యలను విడిచిపెడుతున్నారు. ఈ ఘోరకలి రాబోయే చెడు రోజులకి సంకేతం లాగ ఉంది. తాము బతకమనే విషయం తెలిసిందో ఏమో, కొందరు కుటుంబసమేతం గా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు నగర ప్రజలు, గుళ్ళను, గోపురాలను ఆశ్రయిస్తున్నారు. 

     రాకుమారుడు ఆలోచనల నించి బయటపడ్డాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా అతనికి లీలగా ఒక ఆలయం ఎదురుగా కనిపిస్తోంది. కొంతసేపటికి, ఉరుములు, వాన శబ్దాల మధ్య, ఈదురు గాలికి కొట్టుకుంటున్న ఆ గుడి గంట కూడా అతనికి వినిపించింది. కాని సమయానికి తాను ఎదురీదుతున్నాడని తెలుసు అతనికి. రామాలయానికి చాల దగ్గరిలో ఉండగా, ఆకాశంలో ఒక భయంకరమైన ధ్వని, వెలుగు కనిపించాయి అతనికి. చిన్నగా విరక్తిపూరితమైన నవ్వు నవ్వాడతను. ఆ వెనువెంటనే నగర ప్రజల హాహాకారాలు వినిపి౦చాయి. వెర్రి వాళ్ళు, ఆకాశం నించి ఏదో పడటం చూసి ఉంటారు. 

    ఇక లాభం లేదని,రాకుమారుడు, సొమ్మసిల్లిన ఆమెని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఒక్క ఉదుటన ఆ రధం నించి దూకాడు. నేలపై ఆనుతూనే, తన శక్తినంతా ఉపయోగించి మరొక్క మారు గాలిలోనికి లంఘించాడు. ఈ సారి రామాలయం ముందున్న మంటపం లోనికి పడ్డారు ఇద్దరూ. ఇప్పటికే కూలబడిన అతడు, తన చేతుల్లోని స్త్రీని చాల జాగ్రత్తగా మంటపం మధ్యలో పరు౦డబెట్టాడు. ఏదో అనిపించి, తలెత్తి చూసాడు, పైన రామాలయం గంట మోగుతూనే ఉంది. పర్వాలేదు, తన బాధ్యత నిర్వర్తి౦చాననుకున్నాడు. 

      నిజానికి అతనికి ఏమి వినిపించటం లేదిప్పుడు. నేలపై ఆని మళ్లీ దూకినప్పుడు, అతని పాదం చీరుకుపోయింది. ఇప్పుడా పాదం రెండుగా కొంతవరకు చీలి, రక్తం వస్తోంది. ఎదురుగా స్పృహ తప్పిన ఆమెని చూసి, కళ్ళు మూసుకున్నాడతను. కళ్ళు మూసుకున్నాడు అనటం కంటే, స్పృహ కోల్పోయాడని చెప్పవచ్చు. 

    అది జరిగిన ఉత్తరక్షణం, ఒక పెద్ద వెలుగు, అతని వెనుక కనిపించిది. చెవులు చిల్లులు పడేటటువంటి భయంకరమైన శబ్దం చాల సేపు ఆ పరిసరాల్లో వినిపించింది. ఒక ఈదురు గాలి, ఏదో సందేశాన్ని మోసుకువస్తున్నట్టు, ఎవరికోసమో వెతుకుతున్నట్టు చాలా సేపు తచ్చాడింది. ఆ పక్కగా ప్రవహిస్తున్న గంగానది, ఏడ్చిఏడ్చి కనీళ్ళు ఇంకిపోయినట్టు, ఎండిపోయింది. ఆ ప్రదేశాన్ని కమ్ముకున్న మృత్యు మేఘాలు ఆ పై లోకాలకు దారి ఇస్తున్నట్టు విచ్చుకున్నాయి. అంతా ఐపోయింది. మనుషులే కాదు, నగర ప్రధాన కేంద్రం నించి పది మైళ్ళ దూరం లోని అన్ని ప్రాణులూ దేహం చాలించాయి. చెట్లు రక్తం కారుస్తున్నట్టు, రక్తవర్ణం దాల్చాయి. మనుష్య జాతి చరిత్రలో, ఇదివరకెన్నడూ చూడని విలయం మొదటిసారి పలకరించింది. కన్యాకుబ్జం, ఆ నిండు చూలాలి గర్భం లోని పసికందు కోసమని, శతాబ్దాల శాపాన్ని మోయడానికి సిద్ధమైంది. 

    బయటినించి ఇది చూస్తున్నట్టు అనిపిస్తున్న అర్జున్, మొహం తిప్పుకున్నాడు. ఈ సారి, రాకుమారుడు వేషంలో,  దూరం గా ఉన్న అర్జున్ తనకి కనిపించాడు, ఆ రాకుమారుని కళ్ళలో సన్నటి కన్నీటి పొర.

    అర్జునా..., దూరం గా రాజ గురువు  పిలుస్తున్నట్టు అనిపించింది అర్జున్ కి. వెంటనే కళ్ళు తెరిచాడు అర్జున్, అతని కళ్ళల్లోనూ ఒక సన్నటి కన్నీటి పొర.

(సశేషం)


No comments:

Post a Comment